పెట్టుబడులతో రండి.. సహకరిస్తాం
- ప్రభుత్వ భూములు ఇచ్చి ప్రోత్సహిస్తా
- టూరిజం అభివృద్ధిలో హోటళ్లది కీలక పాత్ర
- అందుకే పాలసీని తెచ్చి ఆహ్వానిస్తున్నాం
- హోటలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, అందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం పలు రాష్ట్రాల హోటల్ రంగ ప్రముఖులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హోటలర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతోపాటు, పలు అంశాలపై చర్చించారు. హోటల్ రంగం పర్యాటక రంగానికి అనుబంధంగా పెద్ద ఎత్తున వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించే ముఖ్యమంత్రిగా హోటలర్స్ అసోయేషన్ తరఫున కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హోటలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి చర్చలో వచ్చిన అంశాలను వివరించారు.
తాము చర్చించాలనుకున్నఅన్ని విషయాలను సీఎం చంద్రబాబు సావధానంగా సమయం కేటాయించి విన్నారని, సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో హోటల్స్, రెస్టారెంట్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టేవారందరినీ తీసుకురావాలని సూచించారన్నారు. ఆలిండియా హోటల్స్ అసోసియేషన్‌లోని ముఖ్యులతో సలహామండలిని ఏర్పాటు చేస్తామని, ఈ విషయంపై తాము హర్షం వ్యక్తం చేస్తు్న్నామని చెప్పారు. బ్రాండెడ్ హోటల్స్ ఇన్వెస్టర్స్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారన్నారు. టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే పాలసీ కూడా ఇచ్చిందని, పెట్టుబడిదారులు ముందుకు వస్తే వారికి కావాల్సిన సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. దేశంలో ముఖ్యమైన పెట్టుబడిదారులను ఆంధ్రాకు తీసుకురావాలని, ప్రభుత్వం మీతో ఉంటుందని భరోసానిచ్చారన్నారు. చిత్తూరు, శ్రీశైలంలలో పర్యాటకాభివృద్ధికి విస్తృతావకాశాలు ఉన్నాయని, అక్కడ భూములు కేటాయిస్తామని, స్టార్ హోటల్స్ నిర్మించాలని సూచించారని, ఆ దిశగా తాము ఆలోచన చేస్తామని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని, త్వరితగతిన అవి ప్రారంభం కాబోతున్నాయని చెప్పారన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే సంకల్పంతో ప్రభుత్వం ఉందని ఈ భేటీతో స్పష్టమైందని ఆర్వీ స్వామి చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రంగా మారిందని, అక్కడ హోటల్స్ నిర్మించాలని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారన్నారు. శ్రీశైలంలో అయితే ప్రభుత్వ స్థలం కూడా ఇస్తామన్నారని, భక్తులు, పర్యాటకుల కోసం హోటల్స్ కట్టాలని కోరారని, త్వరలోనే ఈ విషయంపై తాము ముందడుగు వేస్తామని స్వామి చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణా హోటలర్స్ అసోసియేషన్ నాయకులు వెంకట రెడ్డి, తమిళనాడు హోటలర్స్ నాయకులు సుబ్బు, జీయార్టీ హోటల్స్ ఛైర్మెన్ నటరాజన్, తాజ్ సెలెక్షన్స్ హోటల్స్ ప్రతినిధి బాలకృష్ణ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రభుత్వ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, హోటల్ రంగ ప్రముఖులు సోమరాజు, టూరిజం అధికారులు పాల్గొన్నారు.