గ్రామ ప్రజలతో సమావేశమైన పంచాయతీ ఛాంపియన్స్
సమగ్ర గ్రామీణాభివృద్దే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యం
జి.కొండూరు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ఆదేశాల మేరకు ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ శిక్షణ లో పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోని గంగినేని గ్రామంలో సమగ్ర గ్రామాభివృద్దికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. శనివారం గంగినేని గ్రామంలో డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తన పార్లమెంట్ పరిధిలోని 295 గ్రామాలను సమగ్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామల పరిపూర్ణ వికాసంలో భాగంగా ఫైలెట్ ప్రాజెక్ట్ గా జి.కొండూరు మండలంలోని ఆరు గ్రామాలను క్లస్టర్ గా తీసుకున్నట్లు తెలిపారు. పంఛాయతీ ఛాంపియన్స్ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సూచనలు మేరకు గ్రామంలో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చటం కోసం ఒక ప్రణాళికగా పని చేస్తారని వివరించారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ జివి నరసింహారావు మాట్లాడుతూ ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని ముందు తీసుకువెళ్లుందుకు ఎంపి కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. గ్రామల పరిపూర్ణ వికాసం కోసం ఆసక్తి గల యువకులకి శిక్షణ ఇప్పించి పంచాయతీ ఛాంపియన్స్ గా తయారు చేశారని, వారు గ్రామంలో తాగునీరు-సాగునీరు సమస్య రాకుండా, వ్యవసాయం, పరిసరాల పరిశుభ్రత, వైద్యం, విద్య ఎలా అభివృద్ది చేయాలో అనే అంశంపై కృషి చేస్తారని వివరించారు. అలాగే ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది ఎలా చేందాలనే అంశంపై కుటీర పరిశ్రమలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. గ్రామాల్లో ప్రజల ఆర్థిక అభివృద్ది, కుటీర పరిశ్రమ స్థాపన, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, ఉపాధి అవకాశాల మెరుగుదల కోసం పంచాయతీ ఛాంపియన్స్ కృషి చేయటంతో పాటు ప్రజలకు అండగా నిలుస్తారని తెలిపారు. అదనపు ఆదాయం కోసం ప్రజలు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. ఇందుకోసం పంచాయతీ ఛాంపియన్స్ అవగాహన కల్పిస్తారని చెప్పారు.
ఈకార్యక్రమంలో గంగినేని మాజీ సర్పంచ్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మంగళంపాటి వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు డి.రమణ, పార్టీ సెక్రటరీ ఆల కొండలరావు, మండల సమైఖ్య అధ్యక్షురాలు హైమవతి, మైలవరం నియోజకవర్గ ఎస్ఈ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్ రావు, పంచాయతీ ఛాంపియన్స్ గోపి,జాన్ పాల్ లతో పాటు డ్వాక్రా సంఘ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.