జిల్లాలో 2,28,813 పెన్ష‌న్ల‌కు రూ. 98.11 కోట్లు విడుద‌ల*

*ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 31, 2025*

*జిల్లాలో 2,28,813 పెన్ష‌న్ల‌కు రూ. 98.11 కోట్లు విడుద‌ల*



- *పేద‌ల సేవ‌లో స్ఫూర్తికి అనుగుణంగా పంపిణీ చేప‌ట్టండి*

- *క్షేత్ర‌స్థాయిలో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ త‌ప్ప‌నిస‌రి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*


జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,28,813 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేయాల‌న్నారు.

సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీపై టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. పేద‌ల సేవ‌లో.. స్ఫూర్తికి అనుగుణంగా పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేశారు. మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించి, ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌న్నారు. పంపిణీ స‌మ‌యంలో ఇబ్బందిలేకుండా ఉండేందుకు పెన్ష‌న్ ర‌కాన్నిబ‌ట్టి న‌గ‌దు మొత్తాన్ని బండిల్‌గా సిద్ధం చేసుకోవాల‌న్నారు. ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్ద నుంచి 300 మీట‌ర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్ష‌న్ పంపిణీ చేయాల్సి వ‌స్తే అందుకు త‌గిన కార‌ణాన్ని ఎన్‌టీఆర్ భ‌రోసా మొబైల్ యాప్‌లో న‌మోదు చేయాల్సి ఉంటుంద‌ని.. ఆసుప‌త్రులు, వృద్ధాశ్ర‌మాలు, పాఠ‌శాల లేదా క‌ళాశాల‌లోని విభిన్న ప్ర‌తిభావంతులైన విద్యార్థులు, సిగ్న‌ల్ స‌మ‌స్య‌, న‌రేగా ప‌నిప్రాంతం.. త‌దిత‌ర కార‌ణాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

టెలీకాన్ఫ‌రెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)