*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*
*రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలి..*
- *ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కార్యక్రమాన్ని కొనసాగించాలి*
-
*ప్రతి దశలోనూ చేయాల్సిన పనులపై అప్రమత్తంగా ఉండాలి*
- *కేతనకొండ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
సమగ్ర రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలని.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో సర్వే కార్యకలాపాలు కొనసాగించాలని, ప్రతిదశలోనూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, కేతనకొండ గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్లో గ్రామానికి సంబంధించి రీసర్వే స్థితిగతులను పరిశీలించారు. గ్రామం పరిధిలో 608 ఎకరాలకు గ్రౌండ్ ట్రూతింగ్ జరిగినట్లు సర్వేయర్లు వివరించగా.. అందుకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. తర్వాత చేపట్టాల్సిన గ్రామ సభలు, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితరాలపై కలెక్టర్ క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా రైతులకు కచ్చితమైన రికార్డులు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. గ్రామంలోని ప్రతి రైతుకు వారి పొలాల సర్వే నిర్వహణ విషయాన్ని నోటీసు ద్వారా తెలియజేశారా? లేదా నోటీస్ బోర్డులో సమాచారాన్ని పొందుపరుస్తున్నారా? లేదా? తదితర విషయాలను అడిగారు. రైతులకు ఏవైనా సందేహాలుంటే వారితో మాట్లాడి భూముల రీ సర్వే విషయమై వారికి గల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. గ్రామంలో జరిగే రీ సర్వే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. రీ సర్వేతో రైతులకు ఏవిధంగా కచ్చితమైన కొలతలతో మున్ముందు రికార్డులు అందుబాటులోకి వస్తాయో వివరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ వై.వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి.వరప్రసాద్, విలేజ్ సర్వేయర్లు, వీఆర్‌వోలు, వీఆర్ఏలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు.