జిబియస్ పై ఏపీ సచివాలయంలో పబ్లిసిటీ సెల్ లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కామెంట్స్...
రాష్ట్రంలో నమోదవుతున్న గులియన్ బారీ సిండ్రోం(జిబియస్)పై వైద్య,ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అప్రమత్తంగా ఉంది.
వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబు గారు, నేను పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాము.
ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై సమీక్ష చేశారు. గతంలో నమోదైన జిబియస్ కేసుల వివరాల్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి, ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాల్ని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
గతంలోనూ మరియు ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాల్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను.
2024లో 17 ప్రభుత్వ సర్వజనాసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి.
వాటిలో అత్యధికంగా గుంటూరు జిజిహెచ్ లో 115, కాకినాడ జిజిహెచ్ లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కెజిహెచ్ లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జిజిహెచ్ లలో 1 నుంచి 8 దాకా నమోదయ్యాయి. పాడేరు,రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు,నంద్యాల, అనంతపురం జిజిహెచ్ ల పరిధుల్లో కేసులు నమోదు కాలేదు.
గుంటూరు జిజిహెచ్ లో అత్యధికంగా కేసులు నమోదుకు కారణాలు విచారించాను. అక్కడ న్యూరాలజీ విభాగం సామర్ధ్యత దృష్ట్యా మరియు ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజక్షన్ లభ్యత కారణంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి మరియు ఇతర ప్రభుత్వాసుపత్రుల నుంచి కేసులు రావడం కారణమని అధికారులు చెప్పారు.
ఈ ఏడాది జనవరిలో 43 జిబియస్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతేడాది, ఈ ఏడాది నమోదైన జిబియస్ రోగుల పూర్వాపరాల్ని క్షుణ్నంగా పరిశీలించి ఈ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారుల్ని ఆదేశించాను.
రాష్ట్రంలో జిబియస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజక్షన్లు ఉన్నాయి.
అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం జిజిహెచ్ లలో మొత్తం 749 ఇంజక్షన్లు ఉన్నాయి. దీనికి అదనంగా ఎపిఎంఎస్ ఐడిసి గోడౌన్లలో మరో 469 ఇంజక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజక్షన్లను 13 జిజిహెచ్ లకు తరలిస్తున్నాము. దీంతో మొత్తం 17 జిజిహెచ్ ల్లో ఈ ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి.
నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ...అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజక్షన్లను కొనుగోలు చేస్తాము.
ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ మరియు సైంటిఫిక్ విషయాల్ని గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుందరాచారి వివరిస్తారు.