*పేదల బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా..*
- *అవకతవకలకు ఆస్కారం లేకుండా నిరంతర తనిఖీలు*
-
- *ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు*
- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
విజయవాడ,పెన్ కౌంటర్ న్యూస్ ::ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే పేదల బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా పెట్టడం జరిగిందని.. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
సోమవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి భవానీపురంలో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోదామును తనిఖీ చేశారు. కస్టమ్ మిల్ల్‌డ్ రైస్ (సీఎంఆర్)లో పీడీఎస్ బియ్యం ఏమైనా కలిశాయా.. లేదా? నిర్దేశ ప్రమాణాల ప్రకారమే మిల్లులు సీఎంఆర్ కింద బియ్యం ఇస్తున్నాయా.. లేదా? అనేదాన్ని నిర్ధారించే రైస్ ఏజ్ టెస్ట్, నాణ్యతా పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. సరకు నిల్వ పరిమాణాలతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం విజయవాడ అర్బన్ పరిధి సీతారాంపురంలోని నెం. 225 చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్సు, ఆన్‌లైన్ ప్రకారం స్టాక్ వివరాలు, సరుకు నాణ్యతతో పాటు డీలరు సక్రమంగా రికార్డులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మిల్లులు సీఎంఆర్ కింద ఇచ్చే బియ్యంలో రీసైకిల్ చేసిన పీడీఎస్ బియ్యం కలిపేటటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని.. ప్రతి బఫర్ గోదామును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ఎండీయూ ఆపరేటర్ల కార్యకలాపాలు తదితరాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 957 రేషన్ దుకాణాలను, ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు ప్రతినెలా 20 దుకాణాలను తనిఖీ చేయాల్సిందేనని.. అదేవిధంగా తహసీల్దార్లు నెలకు అయిదు దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. పౌర సరఫరాల డీఎం, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేయాలన్నారు. పేదల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా అమలవుతున్న పీడీఎస్ బియ్యంలో ఒక్క గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని.. ఉల్లంఘనలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.
కలెక్టర్ వెంట పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాసు, డీఎస్‌వో ఎ.పాపారావు తదితరులు ఉన్నారు.