మంత్రి లోకేష్ గారికి పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 04.02.2025.
ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేసినట్లు మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ చెరువు మాధవరం వద్ద గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన 230 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం వినియోగించాలని కోరినట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. మరో రెండు, మూడు వారాల్లో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవికి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. పుల్లూరు, చండ్రగూడెం, హావేలి ముత్యాలంపాడు, కుదప గ్రామాల వద్ద వంతెనల నిర్మాణాలకు, మైలవరం-నూజివీడు రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ గారు హామీ ఇచ్చారని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని శ్రీ ఆలపాటి రాజా గారి ఘన విజయానికి కృషి చేయాలని లోకేష్ గారు చెప్పినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు వెల్లడించారు.