నిడదవోలు
*కోళ్ల మృత్యువాత ఘటనలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్*
*నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50వేల కోళ్లు మృత్యువాత పడ్డాయన్న ఘటనపై స్పందించిన మంత్రి దుర్గేష్*
*కోళ్లకు వైరస్ సోకకుండా అధికార బృందం ముందు జాగ్రత్తలను చేపట్టిందని వెల్లడించిన మంత్రి దుర్గేష్*
*గ్రామంలో, ఫౌల్ట్రీ సంబంధిత ప్రదేశాల్లో అధికారులు శానిటేషన్ ప్రక్రియ చేపట్టారని తెలిపిన మంత్రి*
*ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి దుర్గేష్*
*కొన్నాళ్ల పాటు గ్రామస్థులు చికెన్, గుడ్లు తినవద్దని మంత్రి దుర్గేష్ సూచన*
*కానూరు అగ్రహారానికి 10 కి.మీ ల పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించిన మంత్రి దుర్గేష్*
నిడదవోలు, 10 ఫిబ్రవరి,2025 : నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50వేల కోళ్లు మృత్యువాత పడ్డాయన్న ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ అంశంపై కలెక్టర్ పి. ప్రశాంతితో పాటు స్థానిక ఎంపీడీవో సి.హెచ్ వెంకట రమణ, ఎమ్మార్వో అచ్యుత కుమారిలతో చర్చించానని ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చనిపోయిన 10వేల కోళ్లను గొయ్యి తీసి పూడ్చి పెట్టే కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలను అధికారులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాని భరోసానిచ్చారు. గ్రామంలో, ఫౌల్ట్రీ సంబంధిత ప్రదేశాల్లో అధికారులు శానిటేషన్ ప్రక్రియ చేపట్టారని తెలిపారు. ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దయచేసి కొన్నళ్ల పాటు గ్రామస్థులు చికెన్, గుడ్లు తినవద్దని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సూచించారు. కానూరు అగ్రహారం గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ఫౌల్ట్రీ నిర్వాహకులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైరస్ సోకిన కోళ్లను తగిన జాగ్రత్తలతో పూడ్చిపెట్టాలని, వాటి తరలింపులో అత్యంత సురక్షిత మార్గాలను అనుసరించాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను ప్రజలకు విక్రయించవద్దని హెచ్చరించారు.కోళ్లకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఫారాలు, ఫీడ్ స్టోరేజీ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ సాధ్యమన్నారు. త్వరలోనే ముందస్తు టీకాను వేసి కోళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రజానీకానికి భరోసానిచ్చారు.
*జారీ చేసిన వారు: పీఆర్వో, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ*