మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం చర్యలు

 *మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం చర్యలు* qq


న్యూస్ నైన్ ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 08.01.2025.



మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కోసం కృష్ణానదిలో భారీసంఖ్యలో చేప పిల్లల్ని విడుదల చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.


ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆయన బుధవారం గంగపుత్రులతో కలసి చేపపిల్లలను కృష్ణానదిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కృష్ణానదిలో మత్స్యసంపదను పుష్కలంగా పెంపొందించే క్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల ఉధృతికి నదిలో మత్స్యసంపద ఎంత ఉందో ఇతమిద్ధంగా తెలియదన్నారు. 


మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కృష్ణానది చేపలు అంటే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతారన్నారు. ఈ చేపల ఉత్పత్తి స్థానికంగా చేపల వినియోగాన్ని పెంచుతుందన్నారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన చేపలు ఆహారంగా లభిస్తుందన్నారు


తాజాగా 7.5 లక్షల చేపపిల్లలను కృష్ణానదిలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 7.5 లక్షల చేప పిల్లలలో సుమారు 70 శాతం బ్రతుకుతాయని అన్నారు. 70 శాతం బ్రతికితే 5.25 లక్షల చేప పిల్లలు '7' నెలలలో 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయన్నారు. దీని ద్వారా ఒక కేజీ చేప @100రూపాయలకు గాను రూ.5.25 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తద్వారా మత్స్యకార రంగంపై, చేపల వేటపై ఆధారపడిన సుమారు 5 వేల మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. 


ఇబ్రహీంపట్నం ఫెర్రి వద్ద ఫిష్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. పవిత్ర సంగమం పూర్వవైభవానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీకి కూడా త్వరలో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీకి సభ్యత్వమే లేనప్పుడు ప్రత్యేకంగా రాజీనామాలు సమర్పించాల్సిన అవసరం లేదని మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎన్డీఏ కూటమి పాలన నచ్చి వైసీపీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి, వారంతా టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.