మద్యం అమ్మకాలలో దూసుకుపోతున్న రాష్ట్రం - లోక్ సత్తా!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మద్యం అమ్మకాలలో గణనీయమైన ప్రగతిని కనబరుస్తూ దూసుకుపోతుందని అందుకు ఉదాహరణగా మొన్న సంక్రాంతి పండగ సందర్భంగా జరిగిన మద్యం విక్రయాలే నిదర్శనం అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం అందించడం, ఈ సారి సంక్రాంతికి కోడి పందేల బరులు పెరగడం మొదలైన కారణాల వలన రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో పెరిగాయి. సాధారణంగా మనం గమనిస్తే నూతన సంవత్సర వేడుకలలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు జరిగేవి. అయితే ఈ సారి నూతన సంవత్సర వేడుకలలో కంటే ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగకు కూడా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మూడు రోజుల్లో సగటున రోజుకు 133 కోట్ల విక్రయాలు జరిగాయి. గతంలో ఎన్నడూ సంక్రాంతికి ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు చెప్పడం గమనార్హం. ఇంకా పూర్తి వివరాలు గమనిస్తే..
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో రోజుకు 150 కోట్ల చొప్పున మద్యం అమ్మినట్టు అంచనా. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 80 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ పండగ మూడు రోజుల్లో అదనంగా 160 కోట్లు అమ్ముడైంది. ఈ నెల 10 వ తేదీ నుండి 15 వ తేదీ వరకూ చూస్తే 6,99,464 కేసుల లిక్కర్, 2,29,878 కేసుల బీరు అమ్ముడైంది. ఆరు రోజుల్లో లిక్కర్ కేసులు సగటు కంటే లక్ష కేసులు, బీరు కూడా దాదాపు 30 వేల కేసులు పెరిగాయి. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో లిక్కర్ 23 శాతం, బీరు 38 శాతం అమ్మకాలు పెరిగాయి. సంక్రాంతికి తెచ్చుకున్న సరుకు దాదాపుగా ఖాళీ అయిపోవడంతో షాపుల యజమానులు గురువారం నాడు భారీగా మద్యం కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనిని బట్టి మన ప్రభుత్వానికి సామాన్య ప్రజల కంటే మందు బాబులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని దామోదర రావు అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలి. అలాగే యువతకు ఉపాధి ఇవ్వాలి. అవి మానేసి మేము హామీ ఇచ్చాం కదా అని ఇలా మద్యం ధరలు తగ్గించి అమ్మకాలు పెంచడం వలన చిన్న వయసులోనే యువత మద్యానికి బానిసలుగా మారి సమాజంలో అసాంఘిక శక్తులుగా ఎదుగుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీని వలన భవిష్యత్తు తరాలు నష్టపోతాయి. విజ్ఞులు ఒక్క సారి ఆలోచించండి మనకి తక్కువ ధరకు మద్యం కావాలా? లేక తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందించే ఏర్పాటు కావాలా? మనకు ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి కావాలా? ఆలోచించమని నా మనవి.