*ఏపీలో వాట్సప్ గవర్నెన్స్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్*
దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంది. పౌరసేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. వాట్సప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు.
ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు.
ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే.. ఈ వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సప్ నంబరుకు మెసేజ్ చేసి, తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చు.
ఈ ధ్రువపత్రాలూ పొందవచ్చు..
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)కి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్‌బ్యాక్ తదితర సేవలు దీని ద్వారా పొందవచ్చు.
అమరావతి: దేశంలో తొలిసారిగా 'మన మిత్ర' పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance)కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు.