మూడు రోజులపాటు రథసప్తమి వైభవం తొలిసారి హెలికాప్టర్ టూరిజం

 *పత్రికా ప్రకటన*

మూడు రోజులపాటు రథసప్తమి వైభవం

తొలిసారి హెలికాప్టర్ టూరిజం 

 వేడుకల నిర్వహణపై జిల్లా అధికారుల సమీక్ష  


శ్రీకాకుళం, జనవరి 20 :


అరసవిల్లి రథసప్తమి వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు అంబరాన్ని తాకేలా, జిల్లా పర్యాటకానికి ఊపిరి పోసేలా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.  ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న వేడుకలలో భాగంగా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధికారులతో కార్యక్రమాల నిర్వహణపై ఆయన  సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పలు సూచనలు చేశారు.


 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. తొలి రోజు 80 ఫీట్ రోడ్డు వద్ద ఉదయం 7 గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని, అనంతరం మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కర్రసాము, సంగిడీలు, ఎద్దుల బండ్ల పోటీలు, వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు.  

 

 డచ్ బిల్డింగ్ వద్ద హెలికాప్టర్ టూరిజం ఏర్పాటు చేసామని, 80 అడుగుల రోడ్డు వద్ద వివిధ రకాల స్టాల్స్, అక్కడే ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. అలాగే ఏడు రోడ్ల నుండి అరసవెల్లి ఆలయం వరకు ఘనంగా శోభ యాత్ర నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 80 అడుగుల రోడ్డు వద్ద సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, రాత్రి 9.30 గంటలకు అక్కడే అద్భుతమైన లేజర్ షో, రాత్రి 10 గంటలకు డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్స్ షో ఉంటాయని అన్నారు. మూడు రోజుల పాటు అరసవెల్లి ఆలయంలో సూర్య యాగం ఉంటుందని, ఆలయం వద్ద వివిధ దేవాలయాల మోడళ్లు ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఆయా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా పలువురు అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు.


సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ సిహెచ్ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డిఆర్డిఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య, ఐసిడిఎస్ పీడీ బి.శాంతి శ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎల్.ఎన్.వి. శ్రీధర్ రాజా,  డి ఎస్ డి ఓ శ్రీధర్, పర్యాటకశాఖ అధికారి ఎన్ నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.