రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం లోకేష్ చేసిన మహాయజ్ఞం యువగళం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
*రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చిన యవగళం
*అరాచక పాలకుల్లో భయం పుట్టించిన యువగళం
*ఏపీలో సరికొత్త అధ్యాయం సృష్టించిన యువగళం పాదయాత్ర
*యువగళం తో ప్రజలకు నమ్మకం, ధైర్యం కలిగించిన లోకేష్
*ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో యువగళం కీలకపాత్ర
*వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసిన యువనేత
*గత ఐదేళ్ల జగన్ పాలనలో దెబ్బతిన్న ఎపి బ్రాండ్
విజయవాడ : ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్నిదోచుకుతింటూ, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టి ప్రజాకంఠక పాలన చేసిన జగన్ సర్కార్ పై విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 2023 జనవరి 27వతేదీ పూరించిన సమర శంఖం యువగళం పాదయాత్ర. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రాభివృద్ది కోసం లోకేష్ చేపట్టిన మహాయజ్ఞం యువగళం పాదయాత్ర అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోవటంతో పాటు, మంత్రి నారా లోకేష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో పాల్గొని దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 226 రోజులపాటు 3132 కి.మీల మేర సాగిన యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ ప్రకాశం బ్యారేజీ దగ్గర 2,500 కి.మీ మైలరాయిని ఆవిష్కరించారని గుర్తు చేసుకున్నారు..ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2023లో ఆగస్టు 19, 20, 21 వతేదీల్లో మూడు రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్రకి ప్రజలు బ్రహ్మారథం పట్టగా, గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం ఒక ప్రభంజనంలా తరలిరావటంతో వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు.
రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ జగన్ సర్కార్ ను, వైసిపి నాయకుల అవినీతిని సవాల్ చేయటంతో అరాచక పాలకుల్లో భయం పుట్టించిందన్నారు. ప్రజల కష్టాలు వింటూ వారి కన్నీళ్లు తుడూస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సాగిన పాదయాత్రకి ప్రజలు నీరాజనాలు పలకటమే కాదు...తమకి కావాల్సిన ప్రజా ప్రభుత్వాన్ని ఓటు హక్కుతో సాధించుకున్నారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మాత్రమేకాదు..ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలోను కీలకపాత్ర పోషించిందని కొనియాడారు.
మంత్రి నారా లోకేష్ సాగించిన యువగళం పాదయాత్ర 97 నియోజకవర్గాల్లో సాగితే...ఆ నియోజకవర్గాల్లో ఎన్టీయే కూటమి అభ్యర్ధులు 90 నియోజకవర్గాల్లో విజయం సాధించారని చెప్పారు. యువగళంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలన్నీ నేరవేరస్తున్నారని చెప్పారు.
*దావోస్ లో ఎపి బ్రాండింగ్ పైనే దృష్టి*
జగన్ సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అంథకారంలోకి వెళ్లిపోయింది. ఆ రంగంలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి రాష్ట్రానికి మంచి ఫలితాలను అందించబోతుందని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో జగన్ అరాచకపాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఎపి పునరుద్దరణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ తమ గళాన్ని విన్పించడంలో సఫలీకృతులయ్యారన్నారు. నాలుగురోజులపాటు జరిగిన ఈ సదస్సులో 30మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ ముఖాముఖి భేటీ అయ్యారని తెలిపారు.
డబ్ల్యుఈఎఫ్ వేదికగా ఎపి బ్రాండ్ కోసం లోకేష్ చేసిన కృషి కార్యరూపం దాల్చి త్వరలోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీసీఎస్, బీపీసీఎల్, రిలయన్స్, గ్రీన్ కో, ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడు నెలల్లోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో 50కి పైగా కంపెనీలు వచ్చాయని...యువతకు 40 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు వెల్లడించారు. ఒక్క జూమ్ కాల్ తోనే ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి ఎపికి రూ.1.46లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్ సొంతమన్నారు.జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకురాలేనన్ని పెట్టుబడులు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాధించటం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు విజన్ మెచ్చి, రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలసీలకు పారిశ్రామిక వేత్తలు ఆకర్షితులై దేశ,విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.