వికసిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి ఎంపి కేశినేని శివనాథ్ ప్రణాళిక
ఎన్.ఐ.ఆర్.డి ప్రతినిధులు,కలెక్టర్ లక్ష్మీశ తో ప్రత్యేక సమావేశం
ఫైలట్ ప్రాజెక్ట్ కి రూరల్ నియోజకవర్గాల్లో నాలుగు క్లస్టర్లు ఏర్పాటు
ఫిబ్రవరి 3వ తేదీ ఎన్.ఐ.ఆర్.డి శిక్షణ కార్యక్రమం
విజయవాడ : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 295 గ్రామాలను అభివృద్ది చేసి, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండే విధంగా ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం గురునానక్ కాలనీ ఓ ప్రైవేట్ హోటల్ ఎన్.ఐ.ఆర్.డి ప్రతినిధులు, కలెక్టర్ లక్ష్మీశ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలను వికసిత్ పంచాయత్ దిశగా అభివృద్ది చేయటానికి అమలు చేయాల్సిన ప్రణాళికను ఎంపి కేశినేని శివనాథ్ ఎన్.ఐ.ఆర్.డి ప్రతినిధులు, కలెక్టర్ లక్ష్మీశ కు వివరించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వున్న 295 గ్రామాలను రెండున్న సంవత్సరాల్లోపు సమగ్ర అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ గ్రామాభివృద్ది కోసం చేపట్టబోయే కార్యక్రమాలకు తన సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.
తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఎన్.ఐ.ఆర్.డి ప్రతినిధులు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఆరు గ్రామాలు ఎంపిక చేసి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి..నాలుగునియోజకవర్గాలకు కలిపి 32 మందికి హైదరాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ అందిస్తామన్నారు పదిహేను రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత అభివృద్దికి ఎన్.ఐ.ఆర్.డి మద్దతుగా నిలబడుతుందన్నారు.
వికసిత్ పంచాయత్ లక్ష్యంలో భాగంగా గ్రామాలను ఎనర్జీ సఫిషియేంట్ విలేజ్, హెల్తీ విలేజ్, చైల్డ్ వెల్పేర్ విలేజ్, వుమన్ ఎన్ పవర్మెంట్ విలేజ్, వుమెన్ ఫ్రెండ్లీ విలేజ్, పావర్టీ ఫ్రీ విలేజ్(పేదరికం లేని గ్రామం) గా ఏ విధంగా తీర్చి దిద్దుకోవచ్చు అనే అంశం పై అవగాహన కల్పించటంతో పాటు స్వయం ఉపాధి రంగానికి సంబంధించి కూడా శిక్షణ అందిస్తామని తెలిపారు. ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ అందుకున్న వారు వారి గ్రామాల్లో తయారు చేసే ప్రొడక్ట్స్ కి సంబంధించి ఎంపి కేశినేని శివనాథ్ పేరున్న పెద్ద సంస్థల తో మాట్లాడి మార్కెటింగ్, బ్రాండింగ్ విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మాద్ ఖాన్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ కుమార్ బాంజా, ఎన్.ఐ.ఆర్.డి అధికారులు దీలిప్ కుమార్ పాల్, మురళీకృష్ణ, ఓ.ఎస్.డి. వెంకటరత్నం లతో పాటు తదితరులు పాల్గొన్నారు.