రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కేశినేని, మంత్రి కొల్లు, ఎమ్మెల్యేలు బొండా, గద్దె
క్రెడాయ్ ప్రాపర్టీ షో లో స్టాల్స్ సందర్శన
విజయవాడ : హైదరాబాద్, బెంగుళూర్ లతోపాటు మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీరియల్ ఎస్టేట్ రంగం వల్లే అభివృద్ది చెందుతున్నాయి. రాష్ట్రంలో గత ఐదారేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. భవన నిర్మాణ రంగం అభివృద్ది చెందితేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేసిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
విజయవాడ ఎస్.కన్వెన్షన్ లో మూడు రోజుల పాటు నిర్వహించే క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ లతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి పి.వి.ఆర్ గ్రూప్ బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన అన్ని స్టాల్స్ ను సందర్శించారు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన కొన్ని స్టాల్స్ ను ప్రారంభించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసిన క్రెడాయ్ వారికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందటానికి ముఖ్యకారణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషే కారణమన్నారు. 1995కి ముందు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా వుండేదో అందరికీ తెలుసు అన్నారు. ఆనాడు హైదరాబాద్ లో ఐటి. ఫార్మా ఇండస్ట్రీ అభివృద్ధి చేయటం వల్లే రియల్ ఎస్టేట్ రంగం వృద్ది చెందిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో మౌళిక సదుపాయాలు కల్పించటం వల్లే వ్యాపార రంగంతో పాటు నిర్మాణ రంగం వృద్ది చెందిందన్నారు.
అదే విధంగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్దికి పునాదులు వేయగా...గత ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని నాశనం చేసిందన్నారు. దీంతో గత ఐదేళ్లుగా ఎపిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేల్ అయిపోయిందని. భవన నిర్మాణ రంగంలో పనులు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. మంత్రి నారాయణ దేశంలోని పది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. లే అవుట్‌లలో రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించటం జరిగిందన్నారు.15 మీటర్లలోపు భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతి లేకుండా లైసెన్సెడ్ సర్వేయర్‌కు బాధ్యతలు అప్పగించటం జరుగుతుందన్నారు.భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతాలతోపాటు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ఎన్.ఎ.సి (నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ ) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి , క్రెడాయ్ ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి , క్రెడాయ్ ఏపీ ప్రెసిడెంట్ వై వి రమణా రావు , క్రెడాయ్ విజయవాడ ప్రెసిడెంట్ దాసరి రాంబాబు , క్రెడాయ్ ఏపీ జాయింట్ సెక్రటరీ రమేష్ అంకినీడుతో పాటు తదితరులు పాల్గొన్నారు.