09-12-2024
డిసెంబర్ 9 - అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం - లోక్ సత్తా!
2003 అక్టోబర్ 31వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరగనున్న అవినీతి వ్యతిరేక కన్వెన్షన్ కోసం అడహాక్ కమిటీ రూపొందించిన తుది నివేదికను ఈ సమావేశంలో చర్చించి ఆమోదించారు. 2003 డిసెంబరు 9 నుండి 11వ తేదీ వరకు మెక్సికోలోని మెరిడాలో తుది సంతకాల కోసం అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశం జరిగింది. ఇలా ఐక్యరాజ్య సమితి అవినీతి వ్యతిరేక కన్వెన్షన్ నివేదిక ఆచరణలోకి వచ్చింది. అందుచేత డిసెంబరు 9వ తేదీని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి 58/222 తీర్మానం ద్వారా ప్రకటించింది. 2004 డిసెంబరు 9 నుండి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటింపబడుతున్నది అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి అవినీతి ఒక పెద్ద అవరోధం, అలాగే మంచి పాలనకు కూడా అవినీతి అడ్డంకి అవుతుంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పెంపొందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, సుపరిపాలన ప్రజలకు అందించాలన్నా అవినీతి అంతం చూడాలి. ప్రజల సొమ్ము అక్రమార్జన పరుల కాకూడదు. అవినీతి పరులు ప్రజల సొమ్ము దిగమింగి ఏ స్విస్ బ్యాంకుల్లో దాచేసినా లేక దేశంలోనే ఆస్తులు సంపాదించుకున్నా అలాంటి అక్రమ డబ్బును, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని ప్రజల పరం చెయ్యాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం పేర్కొంది. ప్రజల పన్నుల డబ్బు ప్రజోపయోగానికి ఖర్చు కావాలి. దానికి ఆయా వ్యవస్థలో అవినీతి ఉండకూడదు. అవి సంక్షేమ పథకాలే కావచ్చు, పౌర సేవలే కావచ్చు, కాంట్రాక్టులు, లైసెన్సులు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలే కావచ్చు. వీటిలో అవినీతి ఉండకూడదు. దానికి పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం మాత్రమే అవినీతికి విరుగుడు అని ఐక్యరాజ్య సమితి తీర్మానం చెప్పింది. ఐక్యరాజ్య సమితి రూపొందించిన అవినీతి వ్యతిరేక తీర్మానం పై 2003 లో మన దేశం సంతకం చేసింది. కాని ఆ తీర్మానం అమలుకు ఏడేళ్లు పట్టింది. 2011 మే నెలలో పార్లమెంటు ఆమోదించింది.
ఈ అవినీతి కట్టడికి పౌరులుగా మన వంతు బాధ్యతను కూడా మనం నిర్వర్తించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో మనకు కావలసిన సేవల కోసం లంచం ఇవ్వను అని గట్టిగా తీర్మానించు కోవాలి. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. మన పిల్లలకి కూడా లంచం తీసుకోవడం వలన జరిగే అనర్దాల గురించి చెప్పాలి. ప్రభుత్వాలు కూడా అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని తక్షణమే వారిని విధుల నుండి తొలగించి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తి మొత్తం ప్రభుత్వ పరం అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి. ప్రతి పౌరుడు కూడా నేను అవినీతికి పాల్పడనని, ప్రోత్సహించనని, అవినీతి అంతం కోసం జరిగే అన్ని ప్రయత్నాలలో భాగస్వామిగా ఉంటాననని గట్టిగా సంకల్పించినప్పుడే ఈ అవినీతి భూతాన్ని అరికట్టగలం అని దామోదర రావు అన్నారు.