13-07-2024
రైతు బజారు ఏర్పాటు చేసి ప్రజలకు కంది పప్పు, బియ్యం తక్కువ ధరకు ఇప్పించలేరా?
లోక్ సత్తా...
విజయనగరం జిల్లా బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు చేసి ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తున్న కంది పప్పు, నాణ్యమైన బియ్యం ప్రజలకు మన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పించలేరా? అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలకు బజారులో కన్నా తక్కవ ధరకే నాణ్యమైన బియ్యం, కంది పప్పు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో కంది పప్పు 160 రూపాయలకు అలాగే బియ్యం(సోనా మసూరి పచ్చి రకం) కిలో 48 రూపాయలకు, బియ్యం(సోనా మసూరి స్టీమ్డ్) కిలో 49 రూపాయలకు ఈ నెల 11 వ తారీఖు నుండి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. అయితే మన బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడం వలన మన బొబ్బిలి ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి. విజయనగరం జిల్లాలో అత్యంత జనాభా, అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉన్న మునిసిపాలిటీ బొబ్బిలి. అలాంటి బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడం సిగ్గుచేటు.
నేను మా లోక్ సత్తా పార్టీ తరపున అలాగే మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గత ఇరవై సంవత్సరాలుగా బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు చెయ్యమని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం. మార్కెటింగ్ శాఖ వారు నిధులు ఇస్తాం స్థలం చూడమని చెప్పగా, రైతు బజారు ఏర్పాటుకు స్థలం కూడా చూడడానికి తీరిక లేని పరిస్థితిలో ఉన్నారు మన నాయకులు, అధికారులు. ఏం చేస్తాం మరి? ఈ రైతు బజారు లేకపోవడం వలన బొబ్బిలి ప్రజలు బజారులో కూరగాయలు కూడా అమ్మేవారు ఏ ధర చెబితే ఆ ధరకు కొనవలసిన పరిస్థితి. అదే రైతు బజారు ఉంటే తక్కువ ధరకే కూరగాయలు, బియ్యం, కంది పప్పు, నూనె, మరి కొన్ని దినసరి సరుకులు ప్రజలకు దొరుకుతాయి కదా. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని మన ప్రజా ప్రతినిధులు, అధికారులు తక్షణమే బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న కంది పప్పు, నాణ్యమైన బియ్యం అందించే ఏర్పాటు చెయ్యాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.