చెరువులను రక్షించమని "పవన్ కళ్యాణ్ " కు చెబుదాం

 








*చెరువులను రక్షించమని "పవన్ కళ్యాణ్ " కు చెబుదాం*


* పార్వతీపురం ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు 


*రైతులతో మన ఊరు - మన చెరువును కాపాడుకుందాం* 


* విద్యార్థులతో చెరువుకు పోదాం ఈత కొడదాం 


*తెలుగు పండితులతో చెరువులు పరిరక్షణకై అవధానాలు,  కవితల పోటీలు*


* యువతను భాగస్వామ్యం చేసేలా భావితరానికి భరోసానిద్దాం 


*చెరువులు కబ్జాలపై  రాష్ట్రపతి గవర్నర్లకు సైతం ఫిర్యాదులు చేద్దాం*


* రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఎన్నిక


*ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు**

 ఆంధ్ర రాష్ట్రంలో చెరువులను రక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను కోరదామని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నిర్ణయించింది. విజయనగరం యూత్ హాస్టల్ లో బుధవారం ఆ సమితి సర్వసభ్య సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహా చక్రవర్తి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు చెరువుల పరిరక్షణలో ముందడుగు వేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు సభాముఖంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, దేశంలో ఉన్న ఎంపీలు, మంత్రులు plచెరువుల్లో కబ్జాలు తొలగింపు చర్యలు చేపట్టి, చెరువులను పరిరక్షించాలని కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ  పూర్వ ఉపలపతి హనుమంతు లజపతిరాయ్, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు సంధ్య గజపతిరావు చౌదరి, వంగల దాలినాయుడు, పి. గుణకర రావు, జలపాల గోవిందరావు, సిహెచ్ విఆర్ఎస్ శర్మ, సిహెచ్ శ్రీనివాసరావు, అల్లు సత్యం, ఐ.గోపాల్ రావు తదితరులు మాట్లాడుతూ చెరువుల పరిరక్షణకై  ఇకపై రోజువారి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వెలుగు చూస్తున్న కబ్జాలపై రోజువారి సోషల్ మీడియాలో ప్రజలకు, అధికారులకు తెలియజేయడం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, కబ్జాలు తొలగించేందుకు న్యాయ పరంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థుల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు పిన్నా పెద్ద తేడా లేకుండా మేధావులు, మహిళలు, పెద్దలు, సామాజికవేత్తలు, పార్టీలతో ప్రమేయం లేకుండా రాజకీయ నాయకులను, సమాజాన్ని రక్షించాలని ఆలోచన ఉన్న వారందరినీ కలుపుకొని దీనిలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా చెరువులు పరిరక్షించేందుకు విద్యార్థులతో చెరువుకు పోదాం- ఈత కొడదాం, కార్యక్రమంలో వ్యాసరచన, చిత్రలేఖనం, డిబేట్ పోటీలు నిర్వహించాలని,  రైతులతో మన ఊరు - మన చెరువు కార్యక్రమం చేపట్టి ఊరి రైతులందరితో చెరువులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం, యువతతో మన జాతి సంపదను మనమే రక్షించుకోవాలి, తెలుగు పండితులు, అధ్యాపకులు, రచయితులు, కవులు, ఉపాధ్యాయులతో చెరువులు పరిరక్షణకై కవితలు పోటీలు, అవధానాలు, కథలు పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే చెరువులు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిన కబ్జాదారులపై  దేశ, రాష్ట్ర ప్రథమ పౌరులు రాష్ట్రపతి గవర్నర్ తదితరులు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. న్యాయపరమైన పోరాటానికై   మండల న్యాయ సేవా కమిటీ ద్వారా న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న చెరువుల కబ్జాలను ఆయా ప్రాంతాలకు చెందిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులు, సిబ్బంది దృష్టికి  నిత్యం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం గాని పక్షంలో ఆర్డీవో, జిల్లా కలెక్టర్ స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ తదితర పట్టణాల నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు, జల చక్రాన్ని కాపాడుకునేందుకు, సకాలంలో వర్షాలు కురిసేలా, జలజీవరాసులు, పశు పక్ష్యాదులను కాపాడుకునేలా, సాగు, తాగునీటికై భవిష్యత్ తరానికి మన చెరువులు, గెడ్డలు తదితర నీటి వనరుల సంపదను భావి తరానికి అందించేందుకు యువతను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇంతటి గొప్పదైన నీటి వనరుల పరిరక్షణ అనే క్రతువుకై తన రైల్వే ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల  కృష్ణమూర్తి నాయుడును దుశాలువా  కప్పి మాతృభూమి సేవా సంఘం, ఎన్.వి.ఎన్. బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం నూతన సభ్యులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా నూతనకమిటీలను  ఎన్నుకున్నారు.