బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి - ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలి...లోక్ సత్తా!

 15-07-2024






బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి - ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలి...లోక్ సత్తా!

*****************************

              విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగిన అమానుష ఘటన చూస్తే మనం అసలు సభ్య సమాజంలో ఉన్నామా? అనే ఆవేదన, బాధ కలుగుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఒకసారి గమనిస్తే బాపట్లలో, కర్నూలులో, అనకాపల్లిలో, రామభద్రపురంలో వరుసగా ఆడపిల్లలపై జరుగుతున్న ఈ జుగుస్సాకర ఘటనలు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆడ పిల్లలకు రక్షణ అనేది ఉందా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. ఇలాంటి ఘటనలకు ముఖ్యకారణం యువత, పెద్దవారు మద్యానికి, గంజాయికి, మత్తు పదార్థాలకు బానిస అయి ఆ మత్తులో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నిందుతుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి, బాధితులకు సత్వర న్యాయం అందించే ఏర్పాటు చెయ్యాలి.  ప్రభుత్వం విచ్చలవిడి మద్యం అమ్మకాలను తగ్గించాలి, బహిరంగ మధ్యపానం నిషేదించాలి. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాలి. ఉదాహరణకు మన బొబ్బిలిలో పాత బొబ్బిలి వెళ్లే రహదారిలో గుడి, బడికి దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేసారు. ఆ రహదారిలో ఉదయం పదకొండు గంటల నుండి బహిరంగంగా మద్యం తాగినా అడిగే నాథుడు లేడు. సాయంకాలం ఆ రహదారిగుండా నిత్యం చదువుకునే అమ్మాయిలు, పని నుండి ఇంటికి చేరుకునే మహిళలు వెళుతూ ఉంటారు. ఇలా ఆరు బయట తప్పతాగి ఏ మహిళను గాని అమ్మాయిని గాని ఆ మధ్యం మత్తులో ఎవరయినా అఘాయిత్యం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అక్కడ మద్యం దుకాణం తీసేయమని నేను మా లోక్ సత్తా పార్టీ తరపున అలాగే వామ పక్ష నాయకులు, పాత బొబ్బిలికి చెందిన మింది విజయమోహన్ మాష్టారు ఎన్ని సార్లు మొత్తుకున్నా ఫలితం శూన్యం. కనీసం ఇకనైనా పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు వారు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చట్టాలు సరిగ్గా అమలు చేయకపోవడం కూడా కారణం. ఎందుకంటే గంజాయి, మత్తు పదార్థలతో పట్టుబడిన సెలబ్రిటీలు, డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారు చట్టంలో లొసుగులతో జైలు నుండి బయటకు రావడం. దీనివల్ల సామాన్యులు కూడా వారిలానే మనకు ఏమీ కాదులే అనే దీమా కలుగుతుంది. దీని వలన నిందితులకు చట్టాలు అంటే భయం లేదు.

           సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాలుగు రోజులు అందరం హడావిడి చేస్తాం. తర్వాత అంతా మామూలే. అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నాకు అవగాహన ఉన్న మేర కొన్ని సూచనలు చేస్తున్నాను. ఇంకా ఏమయినా ఉంటే అనుభవజ్ఝుల సూచనలు కూడా తీసుకుని అమలు చేస్తే మన ఆడ పిల్లలను రక్షించే వారం అవుతాం అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

1.ప్రభుత్వం మద్యాన్ని ముఖ్య ఆదాయ వనరుగా చూడడం మాను కోవాలి.

2.కఠిన మద్య నియంత్రణ అమలు చెయ్యాలి.

3.బెల్టు షాపులు సమూలంగా తొలగించాలి. 

4.బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగ కుండా కఠిన చర్యలు చేపట్టాలి.

5.మద్యాన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే విక్రయించాలి.

6.మద్యం దుకాణం దగ్గర తాగడానికి అనుమతులు ఇవ్వకూడదు, కేవలం మద్యం కొనుక్కుని తీసుకుని వెళ్లి పోవడమే. 

7.డీ ఎడిక్షన్ సెంటర్ లు విరివిగా ఏర్పాటు చెయ్యాలి.

8.గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాలి.

9.గిరిజన గ్రామాలలో ముమ్మర తనిఖీలు చేపట్టి గంజాయి పంట ఎక్కడ పండిస్తున్నా ద్వంసం చెయ్యాలి. 

10.చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తుతో ముమ్మర తనిఖీలు చేపట్టాలి.

11.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లల పేరు మీద వచ్చే కొరియర్ వస్తువులని చూడాలి.

12.తల్లిదండ్రులు తమ మగ పిల్లలకి ఆడ పిల్లలు, మహిళల పట్ల గౌరవ ప్రదంగా వ్యవహరించే నడవడిక అలవాటు చెయ్యాలి.

13.కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులపై అక్కడి సిబ్బంది ఎప్పటి కప్పుడు విద్యార్థులను గమనిస్తూ ఉండాలి.

14.మద్యం, గంజాయి, మత్తు పదార్థాల వలన కలిగే చెడు ఫలితాలపై ఎప్పటి కప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. 

15.చట్టాలు కఠినంగా అమలు చేసి నిందితులు ఎంతటివారైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే భావనను ప్రభుత్వం కల్పించాలి. 

16.ఇలాంటి ఘటనలపై ఆలస్యం చెయ్యకుండా బాధితులకు సత్వర న్యాయం కోసం పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు అమలు చెయ్యాలి.

17.నిందితులకి బెయిల్ రాకుండా, అలాగే ఏ ఇతర కోర్టులకు వెళ్లకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునే అమలు చెయ్యాలి.

18.తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే అని ప్రభుత్వం భరోసా కల్పించి, కఠిన చట్టాలు అమలు చేసినప్పుడు మాత్రమే సమాజంలో ఆడపిల్లలకు రక్షణ దొరుకుతుంది.