*వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం...:*
*వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి.*
రాయచోటిలో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లపైన దాడి చేయడం దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారమనేది ఎవ్వరికీ శాశ్వితం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడూ ఎవ్వరిపైనా కక్ష్యపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. మున్సిపల్ 4 వ వార్డు కౌన్సిలర్ కొలిమి హారూన్ బాష ఇంటి పైకి వచ్చి దాడికి దిగి, భయబ్రాంతులకుగురిచేయడం, వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేయడం అరాచక చర్యగా అభివర్ణించారు. అలాగే 7 వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయ పరచడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కత్తిపోట్లకు గురైన ఇర్ఫాన్ ప్రస్తుతం కడపలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడులు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామంటూ వైసీపీ నాయకుల ఇండ్ల ఎదుటనే ప్రత్యక్షంగాను, ఇటు ఫోన్లలోబెదిరిస్తుండడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రజా స్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసివుంటారు, వాళ్లపైన దాడి చేయడం ఎంతవరకు సమంజస మన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసింది నేనని, నాపై పగ,కక్ష్య తీర్చుకోవాలన్న భావన వున్న వారు తనపైన నేరుగా తీర్చుకోవాలే కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచిన నాయకులు, కార్యకర్తల జోలికి వెళ్లి, దాడులు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం సరైన పరిణామం కాదన్నారు. పోలీసు అధికారులు స్పందించి బాద్యులపై చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తాను విజయవాడలో వున్నానని, త్వరగా రాయచోటికి చేరుకుని బాధితులను కలిసి అండగా నిలుస్తానన్నారు. ఇలాంటి ఘటనలు చేస్తే ప్రస్తుతం మీకు సంతృప్తి కలగవచ్చుకానీ, భవిష్యత్ లో ప్రజల్లెవ్వరూ మర్చిపోరన్నారు. పగలు పెరుగుతూపోతే సమాజానికి నష్టమన్నారు. ఈ ఉద్దేశ్యంతోనే ఉద్రేకాలకు తావివ్వకుండా తాము పాలన చేశామన్నారు. కానీ ఇలాంటి సంఘటనలు చేసి తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులుకు గురిచేస్తే ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.జిల్లా ఎస్ పి గారు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.