ఏపీ సీఎం చంద్రబాబు కు సవాల్ గా మారనున్న పరిపాలన?

 


*ఏపీ సీఎం చంద్రబాబు కు సవాల్ గా మారనున్న పరిపాలన?*


అమరావతి :-

చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాడిన ప్రభుత్వానికి... జూలై 1 నాటికి రూ. 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మమూలుగా లేవు. 


రైతులకు ఏటా రూ 20 వేలు. స్కూలుకు వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు. 18 నుంచి 59 ఏళ్ళ దాకా ప్రతి మహిళ కు 15 వేలు. నిరుద్యోగ భృతి 3 వేలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవి సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలు.


ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెను సవాళ్ళు. ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోయింది. మరో శ్రీలంకగా మారిపోతుంది. వేల కోట్ల అప్పులు, పప్పు బెల్లాల్లా నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా మైనస్ లో కూరుకుపోయింది. 


ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీ జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది. జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటి దాకా అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఆరోపించింది. ఇపుడు సీన్ రివర్స్ అయింది. 


జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబుకు మళ్ళీ అధికారం అప్పగించారు. కాకపోతే జగన్ అందించిన పథకాల కన్నా ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన పథకాల విలువ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే దాదాపు రెట్టింపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ, పార్టీ తరపున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన మ్యానిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత ఇపుడు చంద్రబాబుపై ఉంది. 


దీనిని బాధ్యత అనే కంటే చంద్రబాబుకు సీఎం కాగానే ఎదురవుతున్న భారీ సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్ ను అధిగమించటా నికి ఆయన భారీ కసరత్తే చేయాలి.