*ఏపీలో అధికారులు భూ రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారా ! : హైకోర్టు సీరియస్*
అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం.
ఆంధ్రప్రదేశ్‌లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. "ఏ ఆధారాలతో భూ రికార్డులు మారుస్తున్నారు? యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు?" అని అధికారులను నిలదీసింది. భూముల యజమానులకు తెలీకుండా, వారికి నోటీసులు పంపకుండా.. వారి వివరణ తీసుకోకుండా రికార్డులలో పేర్లు ఎందుకు మార్చుతున్నారని హైకోర్టు ఫైర్ అయ్యింది.
తమ భూములను ప్రభుత్వ భూములుగా మార్చేశారనీ, ఇందుకు సంబంధించి కలిగిరి మండల తహశీల్దారు ఇచ్చిన ఉత్తర్వుల్ని వెంటనే ఆపాలని నెల్లూరు జిల్లా పరికోట గ్రామానికి చెందిన కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గ్రామంలోని 227(1), 227 (2) భూములు తమవి కాగా.. సమగ్ర భూముల రీ సర్వే పేరుతో వాటిని ప్రభుత్వ భూములుగా మార్చారని కోట మహేశ్వరరెడ్డి, మరో వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. 1961 నుంచి 6 ఎకరాలకు పైగా భూమి తమదిగా ఉందనీ, రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయని వారు తెలిపారు. సమగ్ర భూ రీ సర్వే తర్వాత అడంగళ్ రిపోర్టులో తమ భూముల్ని, ప్రభుత్వ భూమిగా మార్చేశారనీ, దీనిపై తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని వారు హైకోర్టుకు తెలిపారు.
ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారించారు. ROR-1B (రికార్డు ఆఫ్ రైట్స్)లో ఆ భూములు పిటిషనర్లకి చెందినవిగా ఉండగా.. అడంగళ్ రిపోర్టులో ప్రభుత్వ ఆస్తిగా ఎందుకు చూపారని జడ్జి ప్రశ్నించారు. ఏ ఆధారంతో మార్చారో చెప్పాలని ప్రభుత్వ AGPని ఆదేశించారు. దీన్ని పరిశీలించి, వివరాలు ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని AGP కోరారు. అధికారులు తప్పు చేసినట్లు కనిపిస్తోందనీ, అందువల్ల తహశీల్దారు జారీచేసిన ఉత్తర్వుల్ని నిలిపేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా కలిగిరి మండల తహశీల్దారు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది.
ఇలాంటిదే మరో కేసు:
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, రామన్న పాలెం గ్రామానికి చెందిన సత్యనాగేంద్రప్రసాద్ తనకు ఉన్న 72 సెంట్ల స్థలాన్ని RORలో మరో వ్యక్తి పేరుపై మార్చటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు నోటీసు ఇవ్వకుండా, తాను చెప్పుకునే ఛాన్సే ఇవ్వకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు పేరు మార్చేశారనీ, ఏపీ పట్టాదారు పాస్ పుస్తకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూడా హైకోర్టు జడ్జి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారించారు. పై కేసు తరహాలోనే ఈ కేసులో కూడా అధికారులపై ఫైర్ అయ్యారు. పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని ఏజీపీని ఆదేశించారు.