గ్రంథాలయమంటే ఎందుకంత నిర్లక్ష్యం??? లోక్ సత్తా...
విజయనగరం జిల్లా బొబ్బిలి శాఖా గ్రంథాలయంపై అధికారులు, నాయకులు ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావటం లేదని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. సమాచార హక్కు చట్టం-ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి సురేష్ తో కలిసి ప్రస్తుతం ఉన్న శాఖా గ్రంథాలయాన్ని అలాగే పాత భవనాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఈ గ్రంథాలయ సమస్యను పరిష్కారం చెయ్యకుండా అధికారులు, పాలకులు తాత్సారం చెయ్యడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. ఈ గ్రంథాలయ భవన మరమ్మతుల నిమిత్తం గత సంవత్సరం 25-09-2023 నుండి పదిరోజులు పాటు గుత్తేదారుకు అప్పజెప్పమని గ్రంథాలయ అధికారిణికి లేఖ ఇచ్చారు. పది రోజులే కదా వేరే అద్దె భవనం ఎందుకని ఆమె తన ఇంటి వద్ద తాత్కాలికంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసారు. దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తున్నా భవనం మరమ్మతుల పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ సంవత్సరం 29-01-2024 న జనసేన పార్టీ వారు ఈ గ్రంథాలయ సమస్యపై దీక్ష చెయ్యడం జరిగింది. ఈ దీక్షకు లోక్ సత్తా పార్టీ, తెలుగు దేశం పార్టీ సంఘీ భావం తెలియజేసాం. ఆ తర్వాత మునిసిపాలిటీ పాలక వర్గం స్పందించి 6.6 లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనం మరమ్మతులు చేపడతాం అని చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన మాట దాటి దాదాపుగా నాలుగు నెలలు కావస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పనులు ప్రారంభించారు కదా మరి ఎందుకు పనులు ఆపినట్టు? అసలు ఇంతకీ ఈ గ్రంథాలయ భవనం మరమ్మతులు చేసే ఆలోచన వీరికి ఉందా లేక ఏదయినా వేరే ఆలోచన ఉందా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది. పది రోజులే కదా అని తన ఇంట్లో గ్రంథాలయం నిర్వహించిన గ్రంథాలయ అధికారిణి అద్దె కోసం అధికారులను అడిగితే ఆ అద్దె కూడా ఆమెకు ఇవ్వక పోవడం చాలా బాధాకరం. దాదాపుగా తొమ్మిది నెలలు అద్దె ఆమెకు ఇవ్వలేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎక్కడా లేదు.
రోజూ ఈ గ్రంథాలయంలో చదువుకోవడానికి దాదాపుగా వంద మంది వస్తున్నారు. ప్రస్తుతం వీరంతా గ్రూప్స్, రైల్వే, ఎస్ఎస్సీ, బ్యాంకు, పోలీసు, రైల్వే పోలీసు ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారు. అలాగే ఇదే గ్రంథాలయంలో చదువుకుని గ్రూప్ డీ లో ఇరవై మంది, గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో ఇరవై ఐదు మంది, సీఆర్పీఎఫ్ ఎస్సై గా ఏడుగురు ఎన్నికయ్యారని ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు. ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయానికి పక్కా భవనం కావాలని ఎన్ని సార్లు అధికారులకు, పాలకులకు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యం. ఈ గ్రంథాలయ సమస్య కోసం దీక్ష చేసిన జనసేన పార్టీ, తెలుగు దేశం పార్టీ (కూటమి) నాయకులు తాము ఎన్నికలలో గెలిస్తే ఈ గ్రంథాలయానికి కొత్త భవనం ఏర్పాటు చేస్తాం అనే కనీస హామీ ఇవ్వకపోవడం బాధాకరం. మేము పాత భవనాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రహారీ గోడ లేకపోవడం వలన అసాంఘిక కార్యకలాపాలకు, మందు బాబులకు ఈ గ్రంథాలయ పాత భవనం చక్కగా ఉపయోగపడుతుంది. కనీసం ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా సత్వరమే భవన మరమ్మతుల పనులు ప్రారంభించి గ్రంథాలయాన్ని చక్కగా బాగు చేయ వలసినది మరొక్కసారి అధికారులకి, పాలకులకి లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను అని దామోదర రావు అన్నారు.