ఆదేశాలు అమలు చేస్తున్న పెట్రోలు బంకులు...... లోక్ సత్తా!






తూతూ మంత్రంగా ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు చేస్తున్న పెట్రోలు బంకులు...... లోక్ సత్తా!

             జిల్లాలోని పెట్రోలు బంకులు ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తూతూ మంత్రంగా అమలు చేస్తున్నాయే తప్పా పూర్తి స్థాయిలో అమలు చెయ్యడం లేదని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు.  ఆయన మాట్లాడుతూ  ఎన్నికలు జరిగిన అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్ ను కేన్లు, సీసాలలో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్ షిప్ లైసెన్సు రద్దు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. బంకులలో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించమని చెప్పారు. అయితే మేము కొన్ని బంకులను పరిశీలించడం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాలను A4 కాగితం మీద మాత్రమే రాసి  అతికించారు. దీనివలన వినియోగదారులకి సరిగ్గా కనిపించడం లేదు. కొన్ని బంకులలో ఆ కాగితం మీద ఏమి రాసారో కూడా కనిపించని పరిస్థితి. పట్టణ శివారులలో ఉన్న పెట్రోలు బంకులలో నిబంధనలకు విరుద్ధంగా సీసాలలో పెట్రోలు, డీజిల్ చడీ చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. అలాగే చాలా పెట్రోలు బంకులు వినియోగదారులకు అందించవలసిన కనీస సౌకర్యాలు అయిన త్రాగు నీరు, మరుగుదొడ్ల నిర్వహణ, ఉచితంగా వాహనాలకు గాలి నింపడం, కొలత పాత్ర, నాణ్యత పరీక్షకు ఏర్పాట్లు ఉండాలి. ఇవేవీ చాలా బంకులలో కాన రాని పరిస్థితి. పెట్రోలు బంకులపై అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం, అడిగే వారు లేకపోవడం వలన పెట్రోలు బంకుల యజమానులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

              బయట చాలా దుకాణాలలో సీసాలలో పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారు. ఇలా బయట దుకాణాలలో అమ్మే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చెయ్యాలి. పెట్రోలు బంకులలో ఎన్నికల సంఘం ఆదేశాలను వినియోగదారులకు కనిపించేటట్టు పెద్ద అక్షరాలతో ప్లెక్సీలు ఏర్పాటు చెయ్యమని పెట్రోలు బంకు యజమానులకు అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలి. పెట్రోలు బంకులపై పర్యవేక్షణ చేస్తూ కేన్లలో గాని సీసాలలో గాని పెట్రోలు, డీజిల్ విక్రయించిన వారిపైన, నిబంధనలు అతిక్రమించిన వారిపై అలాగే వినియోగదారులకు అందించవలసిన సేవలలో లోపాలు ఉన్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను అని దామోదర రావు అన్నారు. ఆయనతో పాటుగా సమాచార హక్కు చట్టం-ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి సురేష్ ఉన్నారు.