*జగన్ ఆస్తుల కేసు, కొత్త మలుపు.. మళ్లీ మొదటికి?
*
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ కేసు వెనక్కి వెళ్తోంది. న్యాయమూర్తిని బదిలీ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఈ ఎత్తుగడ ఎవరిది? దీని వెనుక ఎవరున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు సామాన్యులను వెంటాడుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఆయన కేసులపై పుష్కరకాలం పాటు విచారణ సాగుతూనే ఉంది. ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్, విజయ సాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్లపై రావాల్సిన తీర్పు, అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. తీర్పు వస్తుందని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. హైకోర్టు ఇచ్చిన గడువు ఏప్రిల్ 30 (మంగళవారం) తో ముగిసింది. తీర్పు వెల్లడించాల్సిన న్యాయమూర్తి బదిలీ కావడంతో తిరిగి మొదటి నుంచి విచారణ చేపట్టాలని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. అనారోగ్యం కారణంగా విచారణ పూర్తి చేయలేకపోయానని సీబీఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు మంగళవారం లేఖ రాశారు. దీంతో డిశ్చార్జ్ పిటీషన్లలపై తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా పడింది. పిటీషన్లపై విచారణను కొత్త న్యాయమూర్తి తిరిగి విచారణ మొదలుపెట్టనున్నారు. దీంతో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ కేసు మొదలైన ఇప్పటివరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. కేసు పూర్తి కాకముందే వాళ్లంతా బదిలీ అయ్యారు. దాదాపు 130 డిశ్చార్జ్ పిటీషన్లపై విచారణ పూర్తికావడానికి చాలా సమయం పట్టడంతో న్యాయమూర్తులు బదిలీ కావడంతో విచారణ మళ్లీ మొదటికి వస్తోంది. కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి నెలకొంది. మరో విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన న్యాయమూర్తి రిటైర్‌మెంట్ వయస్సు దగ్గరపడిందని, ఆయన ఎక్కువకాలం ఉండరనే వార్తలు జోరందుకున్నాయి. డిశ్చార్జ్ పిటీషన్లకు దశాబ్ద కాలంపడితే ప్రధాన కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయన్నది అసలు ప్రశ్న?జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీటు దాఖలు చేశాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి, ధర్మాన, మోపిదేవి, సబిత, గీతారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ మన్మోహన్ సింగ్, శామ్యూల్, బీపీ ఆచార్య, వెంకట్రామిరెడ్డిలతోపాటు పలువురు బిజినెస్‌మేన్లు ఉన్నారు. వీళ్లకు సంబంధించి దాదాపు 130 డిశ్చార్జ్ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.