కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెం ఘాట్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం

 



కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెం ఘాట్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. అడ్డతీగల మండలంలోని సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి తమ గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ చింతవానిపాలెం ఘాట్ కు వెళ్ళే సరికి ఒక్కసారిగా బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో బైక్ అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకొనిపోయి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాంబాబు భార్య కాసులమ్మ, అతడి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తల్లి కూతుళ్లకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.