పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉద్యోగులు ఆపసోపాలు పడ్డారు. నరసన్నపేట జూనియర్ కళాశాలలో నియోజకవర్గానికి చెందిన 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచి ఉద్యోగుల తాకిడి నెలకొంది.
గంటల తరబడి ఎండలో నిరీక్షణ
పోలింగ్ కేంద్రం సమీపంలోనే పార్టీల ప్రచారాలు
ఉద్యోగులకు ఓటు పరీక్ష
నరసన్నపేట: కాలేజీ రోడ్డులో వైకాపా, తెదేపా శ్రేణులను చెదరగొడుతున్న పోలీసులు
నరసన్నపేట, కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉద్యోగులు ఆపసోపాలు పడ్డారు. నరసన్నపేట జూనియర్ కళాశాలలో నియోజకవర్గానికి చెందిన 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచి ఉద్యోగుల తాకిడి నెలకొంది. తొలి రోజు గందరగోళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా ఆదివారం కూడా ఓటర్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో పలువురు గదుల్లో ఉక్కిరిబిక్కిరయ్యారు. పోలింగ్ కేంద్రాల బయట ఎండలో మహిళలు నిల్చోవాల్సి వచ్చింది. పలువురు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు.
వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం
నరసన్నపేట కాలేజీ రోడ్డు వద్ద వైకాపా, తెదేపా శ్రేణుల శిబిరాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు పార్టీల నాయకులు ప్రచారాలతో హోరెత్తించగా, ఆర్వో రామ్మోహనరావు వెంటనే శిబిరాలను తొలగించాలని ఆదేశించారు. దీంతో నరసన్నపేట ఎస్సై అశోక్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. అంతకు ముందు డిగ్రీ కళాశాలలో ఈవీఎంల అమరిక ప్రక్రియకు హాజరయ్యే ఉద్యోగులను లోపలికి అనుమతించడంపై రెవెన్యూ, పోలీసుల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది.
శ్రీకాకుళంలో గందరగోళం..
శ్రీకాకుళలో ఓటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్రాల వద్ద నిర్వహణ లోపం కనిపించింది. శనివారం ఆరు గదులను ఏర్పాటు చేయగా, ఆదివారం 10 గదుల్లో పోలింగ్ చేపట్టినప్పటికీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఓటర్లు అవస్థలు పడ్డారు. సిబ్బందికి రాత్రికి రాత్రి విధులకు కేటాయించడంతో పోలింగ్ ఎలా చేపట్టాలో తెలియక ఓటింగ్‌లో జాప్యం జరిగింది. సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో గాలి ఆడక పలువురు ఇబ్బందులు పడ్డారు.
ఉద్యోగులకు ఓటు పరీక్ష
గార మండల ఓటర్ల ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద గుంపుగా సిబ్బంది
ఓట్లు చెల్లకుండా...
ఓటరుగా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నియమించారు. అయితే గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు, స్టాంపు కూడా తప్పనిసరిగా వేయాల్సి ఉండగా రూమ్ నెంబరు 35, 36ల్లో కేవలం సంతకం మాత్రమే చేశారు. స్టాంపు వేయలేదు. దీంతో ఆయా ఓట్లు చెల్లనివిగా పరిగణించే అవకాశాలున్నాయి. * 35 గదిలో 222 ఓట్లు, 36లో 247 ఓట్లు నమోదు అయ్యాయి. వీటిలో ఎన్ని ఓట్లకు స్టాంపులు వేయలేదో ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పలువురు ఓటర్లు పేర్కొన్నారు. మరో వైపు అంగన్వాడీలకు ఫారం 12 ఇవ్వకుండానే ఓటింగ్‌కు పంపడంతో కొంత గందగోళం నెలకొంది.
పోలీసుల అత్యుత్సాహం
పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విధుల్లో ఉన్న ఓ హెడ్‌కానిస్టేబుల్ మీడియా వారితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఉన్నతాధికారులు ఆయనకు కేటాయించిన స్థానాన్ని మార్చి వేరే కేంద్రం వద్ద వేయగా అక్కడ కూడా సరిగా విధులు నిర్వహించలేదు. పోలింగ్ కేంద్రం వద్దకు ఓటుతో సంబంధం లేని విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు వచ్చి ప్రచారం చేసేందుకు ప్రయత్నించగా సీˆఐ, ఎస్‌ఐలు వచ్చి వారిని అక్కడ నుంచి పంపారు.