ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందనుకోవడం లేదు... మోదీ

 





*ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందనుకోవడం లేదు: ఎన్టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ*


జగన్ తమకు ఎప్పుడూ మిత్రపక్షం కాదన్న నరేంద్ర మోదీ


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని వ్యాఖ్య


ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచే టీడీపీ తమకు మిత్రపక్షమన్న మోదీ


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగన్ ఎప్పుడూ తమ ప్రత్యర్థిగానే కొట్లాడామని స్పష్టం చేశారు. ఆయన ఎప్పుడూ తమకు మిత్రపక్షం కాదన్నారు. పార్లమెంట్‌లో అంశాలవారీగా మద్దతును ప్రకటించారని వెల్లడించారు.


ఆయన ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... జగన్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి... నేను దేశ ప్రధానిని... కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఏ రాష్ట్రమైనా తాము తోడ్పాటును అందిస్తామన్నారు. ఏపీకి కూడా అలాగే కేంద్రం తరఫున తోడ్పాటు తమ బాధ్యత అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. ఈ ప్రభావం కిందిస్థాయి నుంచి కనిపిస్తోందన్నారు.


టీడీపీ తమ పాతమిత్రుడేనని మోదీ అన్నారు. గతంలో ఆ పార్టీతో తమకు పొత్తు ఉందని గుర్తు చేశారు. జనాల మద్దతుతో ఏపీలో ఎన్డీయే సర్కార్ వస్తుందని భావిస్తున్నానన్నారు. ఎన్డీయే కూటమి ఎంపీ సీట్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు.


టీడీపీ, జనసేనతో వెళ్లడంపై ప్రధాని మోదీ స్పందిస్తూ... వీలైనన్ని పొత్తులు తమ పార్టీ మూల సిద్ధాంతమన్నారు. మాకు (పార్టీకి) అహంకారం లేదన్నారు. బీజేపీ చాలా పెద్ద పార్టీ... కాబట్టి మీతో మాకేంటి అనే భావన ఎవరి పట్లా లేదన్నారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను గౌరవించాలన్నారు. వాళ్ల అవసరాలను గుర్తించాలన్నారు. 


గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యం ఎక్కువ అని... అక్కడ ప్రాంతీయ పార్టీల అవసరం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అందుకు భిన్నమైనవన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచే తాము టీడీపీతో కలిసి 




ఉన్నామని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఏవైతో పాలసీలు రూపొందించారో అవి అవినీతికి దారితీసినవి కూడా ఉన్నాయన్నారు. ఆంధ్రాలో లిక్కర్, ఇసుక మాఫియా, తెలంగాణలో భూమాఫియా అని ప్రస్తావించారు. ప్రజల కోసం పని చేసే ఆలోచన ఉంటే ఇంప్లిమెంట్ చేయడం చాలా తేలిక అన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో షార్ట్ కట్ గేమ్ నడుస్తోందని మండిపడ్డారు.