పత్రికా ప్రకటన
*పోస్టల్ బ్యాలెట్లను ఎస్కార్ట్‌ల సాయంతో తరలించాలి*
*స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
విశాఖపట్టణం, మే 30 ః పార్లమెంటు నియోజకవర్గ స్థానంలో పోలైన పోస్టల్ బ్యాలెట్లను జూన్ 02వ తేదీన పటిష్ట భద్రత నడుమ ఎస్కార్ట్‌ల సాయంతో మెయిన్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలని రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున ఆదేశించారు. కమ్యునికేషన్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో భద్రపరిచిన బ్యాలెట్లను ఈ.ఈ.ఈ. బ్లాక్ పరిధిలో ఏర్పాటు చేసిన పార్లమెంటు కౌంటింగ్ కేంద్రం సమీపంలోని మెయిన్ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సి ఉంటుందని ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌లను జాయింట్ పోలీసు కమిషనర్ ఫక్కీరప్పతో కలిసి గురువారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. అక్కడ భద్రతా పరిస్థితులను గమనించారు. స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీళ్లను, అమర్చిన సీసీ టీవీలను పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్‌లను క్షుణ్నంగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని ఆయా ఆర్వోలకు, ఏఆర్వోలకు సూచించారు.
*కౌంటింగ్ కేంద్రాల పరిశీలన*
జూన్ 04వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఏయూ పరిధిలో కౌంటింగ్ కేంద్రాల్లో జరగుతున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియకు అనుగుణంగా వేసిన టేబుళ్లను, కుర్చీలను, కేంద్రం చుట్టూరా వేసిన మెస్ లను పరిశీలించారు. ప్రక్రియ సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు ప్రణాళికాయుతంగా చేసుకోవాలని ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు సూచించారు.
*మీడియా సెంటర్లో ఏర్పాట్ల పరిశీలన*
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని నానో టెక్నాలజీ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన మీడియా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గమనించిన ఆయన ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పక్కా ఏర్పాట్లు చేయాలని డీఐపీఆర్వో ఎస్.వి. రమణకు సూచించారు. ఆర్వోల నుంచి వచ్చే సమాచారాన్ని డిస్‌ప్లే చేసేలా టీవీలను, మానిటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మీడియా ప్రతినిధులను ఆయా కౌంటింగ్ కేంద్రాలకు బ్యాచ్‌ల వారీగా పోలీసుల సాయంతో తీసుకెళ్లాలని చెప్పారు.
ఆయన వెంట జీవీఎంసీ ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.
........................................
జారీ, సార్వత్రిక ఎన్నికల మీడియా కేంద్రం, విశాఖపట్టణం.