ovishield Covid Vaccine: వామ్మో.. అనుకున్నదే జరిగింది.. కోవిషిల్డ్ కొంప ముంచింది..!
Covishield Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా ? ఆ వ్యాక్సిన్.. కోవిషీల్డా..? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. టీకాలు వేసుకున్నవారిని భయపెట్టే వార్తను బయటపెట్టింది.. ఆ వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఆస్ట్రాజెనెకా. ఇంతకూ ఏంటా వార్త..? ఆ టీకాతో ముప్పేంటి..? వైద్య నిపుణులు ఏమంటున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోట్లమందిపై బాంబు పేల్చింది. తాము రూపొందించిన కొవిడ్ 19 టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ సంస్థ..ఇప్పుడు అసలు విషయం అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్-TTSకు కారణమవుతుందని తెలిపింది. టీటీఎస్‌వల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవటం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయాన్ని అంగీకరించేందుకు ఆస్ట్రాజెనెకాకు 3ఏళ్లు పట్టింది. ప్రజలకు వ్యాక్సిన్లు వేసిన ఇన్నేళ్ల తరువాత తొలిసారిగా ఇన్-కోర్ట్ డాక్యుమెంట్స్‌లో ఈ విషయాన్ని అంగీకరించింది ఆస్ట్రాజెనెకా.
ఆస్ట్రాజెనెకా.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్ టీకాను రూపొందించింది ఆస్ట్రాజెనెకా. అయితే ఈ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో జామీ స్కాట్ అనే వ్యక్తి న్యాయపోరాటాన్ని ప్రారంభించాడు. అనంతరం పలువురు ఈ సంస్థపై కేసులు వేయటం మొదలుపెట్టారు. రిపోర్టుల ప్రకారం.. ఆస్ట్రాజెనెకాపై 51 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ సంస్థ అసలు విషయాన్ని అంగీకరించడంతో.. బాధితులకు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని..నష్టపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు వ్యక్తవుతున్నాయి. మరోవైపు తాజా ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో కొవిషీల్డ్ టీకాను నిలిపేశారు.
కోవిషీల్డ్‌ను విక్రయించిన సీరమ్ ఇన్స్టిట్యూట్
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో..బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ఒకటి. ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఈ కొవిడ్ టీకాను..కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. భారత్‌లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కూడా కోవిషీల్డే. స్వదేశీ సాంకేతికతో తయారైన కొవాగ్జిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగటంతో దేశవ్యాప్తంగా చాలా మంది కోవిషీల్డే తీసుకున్నారు.
సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వ్యాక్సిన్లు వేయాలి
కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం సర్వసాధారణమే. టీకా పని చేస్తోందనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చని నిపుణులు అప్పట్లో చెప్పారు. కానీ, టీకాను తయారుచేసిన సంస్థ మాత్రం.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది. కానీ, చివరకు వాస్తవం మాత్రం అంగీకరించక తప్పలేదు. వాస్తవానికి ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసి సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుంది. అయితే కరోనా టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశారనే ఆరోపణలు ఉన్నాయి.
సైడ్ ఎఫెక్ట్‌లోనూ కోవిషీల్డ్‌దే అగ్రస్థానం
ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్ విషయంలోనూ కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కరోనా టీకాలు తీసుకున్నవారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు అనేక అనుమానాలున్నాయి. గడిచిన కొద్ది కాలంగా హటాత్తుగా గుండెపోటుతో మరణించిన చాలామంది కొవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారే అన్న ప్రచారం సాగినా.. దానికి అవసరమైన ఆధారాలు మాత్రం లభించలేదు. తాజాగా తమ వ్యాక్సిన్ లోని సైడ్ ఎఫెక్టులను అంగీకరించటం ద్వారా.. ఇంతకాలం తమపై వస్తున్న ఆరోపణల్లో కొంత నిజం ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లైంది. మరి ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.