ఏపీ ఎన్నికలపై ఈసీ ప్రకటన
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024)పై ఎన్నికల కమిషన్ (Election Commission) కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను తమకు నేరుగా అందచేయొచ్చని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు..
శుక్రవారం నాడు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు నేరుగా సచివాలయంలో అందచేయాలని తెలిపారు. కార్యాలయ పని దినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని వివరించారు..
సమావేశాలు, ఇతర కారణాల వల్ల తాను కార్యాలయంలో అందుబాటులో లేకపోతే అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పడు వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చని అన్నారు..
ప్రభుత్వ సెలవు దినాలలో కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్పారు. సెలవు దినాల్లో ఫిర్యాదు చేయాలంటే సచివాలయంలోని 5వ బ్లాకు (గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.129) లో సంప్రదించాలని సీఈసీ ముఖేష్ కుమార్ మీనా సూచించారు..