జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission ) స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది..
మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు.
నిన్న సీఎం జగన్ విజయవాడలో చేపట్టిన బస్సు యాత్రలో ఆయనపై రాయి దాడి జరిగింది. దీంతో ముఖ్యమంత్రి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. దీంతో సీఎంకు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం కొనసాగించారు. జగన్ నుదుటికు రెండు కుట్లు పడ్డాయని, గాయం పెద్ద తీవ్రమైనది కాదని, ప్రమాదం ఏమీ లేకపోయినా వాపు మాత్రం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.
Iసీఎంపై దాడి ఘటనతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భద్రతపై పలువురు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీతో పాటు సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.