బీచ్ లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు

ఆర్కె బీచ్ , అప్పికొండ బీచ్ లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు



.

విశాఖపట్నం,  మార్చి 25 :  మహావిశాఖ నగర పాలక సంస్థ జోన్ -4 , ఆర్కే బీచ్ , జోన్ -6 అప్పికొండ  బీచ్ లలో సోమవారం హోలీ సందర్భంగా స్నానానికి సముద్రంలో దిగి మునిగిపోతున్న  నలుగురు  యువకులను  గమనించి జీవీఎంసీ లైఫ్ గార్డులు వారిని రక్షించి ప్రాణాలు కాపాడడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. 


విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన కౌశిక్ 20 , బషీర్ 19 , తుంగ్లాం ప్రాంతానికి  చెందిన సన్నీ కుమార్ 17, గోల్ కుమార్ 23 వయస్సు గల కాలేజీ విద్యార్థులు హోలీ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ పాండురంగాపురం, అప్పికొండ బీచ్ సమీపంలో ఆటవిడుపుగా స్నానాలకు బీచ్ లోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్న వారిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ హరీష్, నవీన్, అరవింద్, అచ్చన్న, కిషోర్, వెంకటేష్ ,తాతారావు లతోపాటు పోలీస్ పెట్రోలింగ్ వై గణపతి తదితరులు వారిని ఒడ్డుకు చేర్చారని, వీరిలో ఒకరికి సి పి ఆర్ జరిపి వెంటనే 108 లో కేజీహెచ్ కు తరలించారని,  అందరూ  ప్రాణాలతో ఉన్నారని కమిషనర్ తెలిపారు.


విశాఖ నగర సుందర సముద్రతీరంలో విహరించేందుకు విహారయాత్రికులు, తీర్థయాత్రికులు నిత్యం విశాఖ నగరానికి విచ్చేయడం జరుగుచున్నందున, ఆటవిడుపుగా , ప్రమాదవశాత్తుగా సముద్రంలో కి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వారిని రక్షించేందుకు జీవీఎంసీ 42 మంది లైఫ్ గార్డులను ఇప్పటికే నియమించడం జరిగిందని, వారు నిరంతరం యారాడ ,అప్పికొండ, కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి బీచ్ ల  వరకు  నిఘాలో ఉంటూ సముద్రంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విశాఖ నగర బీచ్ లలో విహరిస్తున్న వారు బీచ్ అందాలను చూస్తూ  ఆహ్లాదంతో ఆనందంగా గడపాలని,  సముద్రంలో దిగి ప్రమాదాలకు గురి కావద్దని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 



పౌర సంబంధాల అధికారి ,

జివిఎంసి.