*రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అనకాపల్లి జిల్లాకు కేంద్ర ఆర్.పీ.ఎస్.ఎఫ్ పోలీసు దళాలు రాక*
*ఎన్నికల సమయంలో ఆర్.పీ.ఎస్.ఎఫ్ దళాలు మరియు జిల్లా పోలీసుల సమన్వయం గురించి అవగాహన కల్పిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఐపీఎస్ గారు*
*అనకాపల్లి, మార్చి 9:* రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు బీహార్ రాష్ట్రం నుండి కేంద్ర పోలీసు దళo ఆర్.పీ.ఎస్.ఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్) కంపెనీ చేరుకున్నది. వీరికి చోడవరంలో ఉన్న చైతన్య బి.ఈ.డి కాలేజ్ లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మరియు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ లు, రూట్ మార్చ్ లు, పాయింట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, తదితర విధులు ఎన్నికలు పూర్తయినంతవరకు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆర్.పీ.ఎస్.ఎఫ్ దళాలతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఆర్.పీ.ఎస్.ఎఫ్ బలగాలతో జిల్లాలోని పరిస్థితుల గురించి అవగాహన కల్పించారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఒక టీం గా అనకాపల్లి జిల్లా పోలీస్ లతో సమన్వయం చేసుకొని పనిచేయడం గురించి, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు.
గ్రామాలలో ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి, ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఆర్.పీ.ఎస్.ఎఫ్ మరియు జిల్లా పోలీసుల సమన్వయం తో పనిచేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. వారికి వసతి సౌకర్యాలు చూపించి, లైజన్ ఆఫీసర్ ను నియమించి ఎటువంటి అవసరం ఏర్పడిన వెంటనే తెలియజేయాలని ఈ సందర్భంగా వారికి తెలిపారు.
అనంతరం అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు గారి ఆధ్వర్యంలో ఆర్.పి.ఎస్.ఎఫ్ దళాలు మరియు చోడవరం పోలీసులు ఐటీ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, గవర్నమెంట్ కాలేజ్, గాంధీ గ్రామం, నరసయ్య పేట, కోపరేటివ్ కాలనీ, టీచర్స్ కాలనీ, ద్వారకా నగర్ ప్రదేశాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ బి.విజయ భాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు, ఏ.అర్ డీఎస్పీ శ్రీ పి.నాగేశ్వరరావు, ఆర్.పీ.ఎస్.ఎఫ్. కంపెనీ కమాండర్ జగదీష్ రాజ్, చోడవరం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
*జిల్లా పోలీసు కార్యాలయం,*
*అనకాపల్లి.*