YCP: ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాం: సిదిరి అప్పలరాజు
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు..
ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి లక్ష్యం రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదేనని అన్నారు. మొన్న జరిగిన సిద్ధం సభ నుంచి ప్రతిపక్షాలు డైలమాలో ఉన్నాయన్నారు. ఇంకా ప్రతిపక్షాలు వాళ్ల ఉమ్మడి జాబితాను విడుదల చేయలేని స్థితిలో ఉన్నాయని విమర్శించారు. గతం కన్నా మెరుగ్గా అత్యధిక సీట్లతో గెలిపించుకోవడం తమ లక్ష్యమని సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు..
మంత్రి రాజన్న దొర మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటారని.. దాని ప్రకారం ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుంటారని, దానిపై కూడా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజధాని కోసం ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారని, న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయని.. అందుచేత వాటి కోసం మాట్లాడకూడదని ఆయన అన్నారు. అన్నీ ప్రాంతాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకువచ్చారని రాజన్న దొర వ్యాఖ్యానించారు..