Chandrababu: మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు
ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన 'రా.. కదలిరా' బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని.. వై నాట్ పులివెందుల అనేదే తమ నినాదమన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు.. గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సూచించారు.
అడ్డం వస్తే తొక్కుకుని పోతాం...
''పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారు. తెదేపా సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నోటీసులో ఏం ఉందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? మనం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారులపై వైకాపా నేతలు కేసులు పెట్టించి వేధించారు. మైనింగ్ అధికారులు వైకాపా మూకలతో వెళ్లి వ్యాపారులను బెదిరించారు. అధికారం ఉందని ఆంబోతుల మాదిరిగా ఊరు మీద పడ్డారు. గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారు. చివరకు నేను, పవన్ కల్యాణ్ కూడా వైకాపా బాధితులమే. మాట్లాడితే జగన్ బటన్ నొక్కానని చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. చెత్త, నీరు, ఆస్తిపై పన్నులు పెంచారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్‌పై జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు. జగన్ పెట్టే ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉంటుంది. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదు.
నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారు..
అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చెప్పారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారు. అమరావతి నిర్మాణం ఆపి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారు. అమరావతి పూర్తయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది. ఆనాడు భాజపాతో విభేదించింది ప్రజల కోసం.. రాష్ట్రం కోసమే. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు. కేంద్రం సాయం చేస్తామన్నా.. తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు'' అని చంద్రబాబు చెప్పారు.