హైదరాబాద్: పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 పెన్ డ్రైవ్‌లు, 7 పాస్‌బుక్‌లు, 33 చెక్కులు, 25 డెబిట్ కార్డులు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నగరానికి చెందిన బాధితురాలిని నిందితులు మోసం చేశారు. వాట్సప్‌లో ఆమెకు పరిచయమైన దుబాయికి చెందిన రైసుల్.. టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. అక్కడ క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. అదే గ్రూప్‌లో రైసుల్ అనుచరులు ఉండి.. తమకు లాభాలు వచ్చాయని స్క్రీన్ షాట్లు పెట్టారు. అది నిజమేనని నమ్మిన మహిళ.. క్రిప్టో ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసింది. విడతలవారీగా రూ.49.45లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆమె బదిలీ చేసిన నగదు జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాల్లో జమ అయింది. అనంతరం యాప్ పనిచేయడాన్ని నిలిపివేశారు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఖాతాలు సమకూర్చినందుకు రైసుల్ వారిద్దరికీ 3 శాతం కమిషన్ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. దేశ వ్యాప్తంగా జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాలు 50కి పైగా సైబర్ నేరాల్లో వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.....