*రేపు విశాఖ శారదాపీఠానికి సీఎం జగన్ రాక*
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం(రేపు) విశాఖ శారదాపీఠాన్ని సందర్శించనున్నారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం తీసుకుని, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో కలెక్టరు మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం పీఠాన్ని సందర్శించారు. ఏర్పాట్ల గురించి పీఠం ప్రతినిధులతో చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ పీఠానికి చేరుకుని సంప్రదాయ వస్త్రధారణతో రాజశ్యామల ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం యాగశాలలో చేపట్టే రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుని తిరిగి పయనమవుతారు.