ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? జగన్ పై షర్మిల ఫైర్

 *ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?: జగన్ పై షర్మిల ఫైర్


*


ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే.. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్న షర్మిల


రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపాటు


మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారని విమర్శ


వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే... విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. 


రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల అన్నారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదని... ఉన్నవి కూడా ఉంటాయో, లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని అన్నారు. 


ప్రధాని మోదీకి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని షర్మిల విమర్శించారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే... పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపే చూపించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్ చూపిస్తే... మూడు రాజధానులంటూ జగనన్న మూడు ముక్కలాట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రోజుకో వేషం, పూటకో మాట మాట్లాడే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగంగానే... ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందని... అందుకే ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.