విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన 'శంఖారావం' సభలో ఆయన మాట్లాడారు..
'రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పులమయం చేసింది. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు. నగరానికి చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చారు. ఇప్పుడు రోజుకో భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి.
లాలూచీతో విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైల్వే జోన్, నగరానికి మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్ నెరవేర్చలేదు. చంద్రబాబు సూపర్-6 పేరుతో హామీలను ప్రకటించారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 18-59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం'' అని లోకేశ్ తెలిపారు.