పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

 *పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు


*


టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్


పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు


టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన


పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి 


టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 


పొత్తులకు సహకరించే నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పొత్తులు ఉన్నందున... టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 


జగన్ తో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరతాం అంటున్నారు... కానీ, మంచివారు, పార్టీకి ఉపయోగపడతారనుకునే వాళ్లనే తీసుకుంటున్నామని వెల్లడించారు. టీడీపీ నేతలు అలాంటి వారి చేరికలను ప్రోత్సహించాలని, వారితో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


రా కదలిరా సభలు ముగిశాక మరో ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. ఎన్నికలకు దాదాపు 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని స్పష్టం చేశారు. 


బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో బీసీ సాధికార సభలు నిర్వహించాలని అన్నారు. జగన్ మోసం చేశారనే భావన ప్రతి ఒక్క బీసీ వ్యక్తిలో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన పార్టీ టీడీపీ... పార్టీలో బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది అని పేర్కొన్నారు.