మల్దీవులపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు



భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య వివాదం కొనసాగుతోంది. భారత ప్రధాని మోడీ పైనా.. భారత్ పైనా మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. అనంతరం చేసుకున్న పరిణామాల సంగతి తెలిసిందే. తమ దేశంలో ఉన్న భారత్ కు చెందిన 88 మంది సైనికుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. చైనా చేస్తున్న ప్రకటనలు మరో ఎత్తు. ఇలాంటి వేళ.. ఈ అంశంపై ఓపెన్ గా ఎలాంటి ప్రకటన.. వ్యాఖ్య చేయని కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తాజాగా స్పందించారు. తొలిసారి మాల్దీవుల వివాదంపై స్పందించిన ఆయన.. విదేశీ విధానంలో రాజకీయం.. రాజకీయమేనని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదంపై మాట్లాడుతూ.. ఏ దేశమైనా తప్పనిసరిగా భారత్ కు మద్దతుగా ఉంటుందని చెప్పలేమన్న ఆయన.. పొరుగు దేశం మొదటి ప్రాధాన్యం ఏమిటో తెలుసకొని దాని ప్రకారమే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రతి దేశం భారత్ తో సఖ్యతగా.. మద్దతు ఇచ్చేలా ఉంటుందన్న హామీని తాను ఇవ్వలేనన్న ఆయన.. గడిచిన పదేళ్లలో భారత్ - మాల్దీవులతో పటిష్టమైన సంబంధాల్ని ఏర్పర్చినట్లుగా పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వం మారిందని రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయన్న ఆయన.. 'అక్కడి ప్రజల్లో భారత్ - మాల్దీవుల మధ్య ఉన్న సంబంధాలపై మంచి అభిప్రాయమే ఉంది' అని పేర్కొన్నారు. రాజకీయ సంబంధాల్లో మార్పులు ఉన్నప్పటికి.. సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్ వైపు సానుకూల భావాల్ని కలిగి ఉన్నట్లుగా చెప్పారు. తన చైనా పర్యటనను ముగించుకొని వచ్చిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మాట్లాడుతూ.. తమది చిన్న దేశమే అయినప్పటికీ బెదిరించటం తగదని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటన చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఎన్నో ఏళ్లుగా మాల్దీవుల్లో ఉన్న భారత్ కు చెందిన 88 మంది సైనికుల్ని తమ దేశం నుంచి మార్చి 15 లోపు వెళ్లి పోవాలని మాల్దీవులు ప్రకటించటం తెలిసిందే. ఈ అంశం రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచుతున్న పరిస్థితి నెలకొంది.